తిరుమల: తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి రోజు లక్షల్లో భక్తులు కొండ మీదకు ప్రయాణిస్తుంటారు. దర్శనానికి ఎంత సేపు వేచి ఉంటారో, అక్కడ వసతి గృహాలు పొందడానికి కూడా అంతే వేచి చూడాల్సిన పరిస్థితి ఎప్పుడూ కనిపిస్తుంది. కాగా టీటీడీ తాజాగా తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదులు పొందే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు
తిరుమలలోని సీఆర్వో ఆఫీస్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన కౌంటర్లను అదనపు ఈవో శనివారం పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇదివరకు సీఆర్వో వద్ద మాత్రమే వసతి గదుల రిజిస్ట్రేషన్, కేటాయింపు చేసేవారన్నారు. అయితే ఇక్కడ ఒక చోటే చేయడం వల్ల అధిక రద్దీ ఉండడం, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్య కు పరిష్కారంగా ఇక త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసి, గదులు కేటాయించేందుకు తిరుమలలోని పలు ప్రాంతాల్లో కొత్త కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో సీఆర్వో వద్ద రెండు కౌంటర్లు, బాలాజీ మెయిన్ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, కౌస్తుభం అతిథి భవనం వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంటర్లు, రాంభగీచ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, ఎంబీసీ ప్రాంతంలోని శ్రీవారి మెట్టు వద్ద రెండు కౌంటర్లు, జీఎన్సీ టోల్గేట్ వద్ద ఉన్న లగేజీ కౌంటర్ వద్ద రెండు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ నూతన రిజిస్ట్రేషన్ కౌంటర్లలో తమ పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు ఎస్ఎమ్ఎస్ ద్వారా వారికి గదుల కేటాయింపు సమాచారం తెలియజేస్తామని అన్నారు. తదుపరి వారికి గదులు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచారణ కార్యాలయాల వద్ద సంబంధిత రుసుమును కట్టి సదరు గదులు పొందవచ్చని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.