తిరుపతి / తిరుమల : ఈ నెల 25 వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో కె జవహర్ రెడ్డి ప్రకటించారు. గురువారమిక్కడ ఆయన మాట్లాడుతూ, ‘24వ తేదీ నుంచి స్థానికులకు టిక్కెట్లు కేటాయిస్తాం.
ప్రతి రోజు ఏడువేల టిక్కెట్లు స్థానికులకు కేటాయింపు ఉంటుంది. అయితే స్వామివారి కల్యాణం టిక్కెట్లు ఉన్నవారికి మాత్రం డిసెంబర్ 25, 26, జనవరి 1న దర్శనం ఉండదు. ఆ మూడు రోజులు సిఫార్సు లేఖలు రద్దు చేశామని తెలిపారు.
అదే విధంగా గోవింద మాల భక్తులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ ఉండవు. 25వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్రారంభం అవుతాయన్నారు. సామాన్య భక్తులకు ఎనిమిది గంటల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనం ప్రారంభం అవుతుంది’ అని తెలిపారు.
కాగా శ్రీవారి దర్శనంలో తమకూ ప్రత్యేక కోటా కల్పించాలని మూడు దశాబ్దాలుగా స్థానికులు (చిత్తూరు జిల్లా) విజ్ఞప్తిని టీటీడీ ఇటీవలే ఆమోదించింది.