తమిళనాడు: వక్ఫ్ (సవరణ) బిల్లు-2025పై విపక్షాల విమర్శలు తారాస్థాయికి చేరిన వేళ, తమిళ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ కూడా వ్యతిరేకత ప్రకటించింది. బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
అన్ని జిల్లా కేంద్రాల్లో టీవీకే నిరసనలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అధినేత విజయ్ ప్రత్యేకంగా పార్టీ జిల్లా కార్యదర్శులకు మార్గదర్శనాలు ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యం పెంచేలా నిరసనలు నిర్వహించాలంటూ స్పష్టం చేశారు.
ఈ బిల్లు ఇటీవల లోక్‌సభలో 288 ఓట్ల మెజారిటీతో ఆమోదం పొందింది. కానీ ప్రతిపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతిపాదించిన సవరణలన్నింటిని వాయిస్ ఓటుతో తిరస్కరించడం వివాదానికి తావిచ్చింది.
ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లును మైనారిటీల సాధికారత కోసం తీసుకువచ్చిందని సమర్థించుకుంటున్నా, విపక్షాలు దీన్ని ముస్లింలకు వ్యతిరేకంగా ఉందంటూ విమర్శిస్తున్నాయి.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, భారతదేశం మైనారిటీలకు ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశమని పేర్కొన్నారు. లౌకికత్వం దేశ ప్రజలలో పునాది అయిందన్నారు.
టీవీకే కూడా ఈ బిల్లుపై గళం పెంచడంతో, ఇది తమిళనాడు రాజకీయాల్లో మరో చర్చనీయాంశంగా మారింది. ప్రజా స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.