ఫైనాన్స్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా టారిఫ్ నిర్ణయాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఊహించని షాక్‌కు లోనయ్యాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన పది సెకన్లలోనే భారత మార్కెట్లలో రూ.20 లక్షల కోట్ల మదుపర్ల సంపద కరిగిపోయింది. ఇది ఒక్కరోజులో భారీ పతనంగా రికార్డు అయింది.
ఈ ప్రభావంతో సెన్సెక్స్ 3,900 పాయింట్లు, నిఫ్టీ 1,150 పాయింట్లకుపైగా పడిపోయింది. ఇది 2020 తర్వాతి కాలంలో స్టాక్ మార్కెట్లకు తగిన అతిపెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో 10% వరకూ పతనం చూసిన మదుపర్లు భయాందోళనకు గురయ్యారు.
టారిఫ్ విధానాల వల్ల ద్రవ్యోల్బణం పెరగడం, కంపెనీల లాభాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల వినియోగదారుల నమ్మకం తగ్గే అవకాశం ఉందని, గ్లోబల్ మాంద్యానికి ఇది సంకేతమని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే జేపీ మోర్గాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 60% మాంద్యం వచ్చే అవకాశముందని అంచనా వేసింది. దీంతో మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారు. విదేశీ పెట్టుబడిదారులు ఏప్రిల్‌లో రూ.13,730 కోట్ల విలువైన షేర్లను అమ్మినట్లు సమాచారం.
రాబోయే రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ తీసుకునే ద్రవ్య పరపతి నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్ల స్థిరత్వంపై ఆధారపడి భారత మార్కెట్ల పుంజుకోవడం ఉండనుందని విశ్లేషకులు చెబుతున్నారు.