దుబాయ్: ఒక అరబ్ దేశం మరో గ్రహం కక్ష్యలోకి అంతరిక్ష నౌకను పంపిస్తుండడం ఇదే తొలిసారి. ఈ విషయం లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చరిత్ర సృష్టించింది. సొంతంగా రూపొందించిన అల్ అమాల్ అనే అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఇందుకు జపాన్‌లోని టానేగషిమా స్పేస్‌పోర్టు వేదికగా నిలిచింది.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1.58 గంటలకు హెచ్–2ఏ అనే రాకెట్ సాయంతో అల్ అమాల్ నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాంటి అపశ్రుతులు లేకుండా ప్రయోగం విజయవంతమైనట్లు సమాచారం అందగానే దుబాయ్‌లోని మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్‌లోని శాస్త్రవేత్తలు, యూఏఈ ప్రజలు ఆనందంలో మునిగిపోయారు.
అల్ అమాల్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల యూఏఈ నాయకత్వానికి, ప్రజలకు భారత్ అభినందనలు తెలియజేసింది. నౌక బరువు 1.3 టన్నులు. ఇది 49.5 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి అంగారక గ్రహం కక్ష్యలోకి చేరుకోనుంది. గ్రహం చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడమే అల్ అమాల్ లక్ష్యం.