ఆంధ్రప్రదేశ్: ఉగాది పంచాంగం: జగన్‌కు మహిళ మూలంగా ఇబ్బందులు?
ఉగాది పంచాంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ మహిళ మూలంగా ఇబ్బందులు ఎదురుకావచ్చని ప్రముఖ జ్యోతిష్కుడు నోరి నారాయణ మూర్తి విశ్వావసూ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. ఆదివారం నాడు తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి.
ఆరుద్ర నక్షత్రానికి ‘జడ’ గండం?
జగన్ జన్మనక్షత్రం ఆరుద్ర కావడంతో, ఆయనకు మిథున రాశి అని నారాయణ మూర్తి వివరించారు. ఆయన ప్రకారం, మిథున రాశి వారికి ఈ ఏడాది మహిళలతో సమస్యలు తలెత్తే అవకాశముందట. దీంతో అక్కడున్న వారిలో ఆసక్తికరమైన ఊహాగానాలు మొదలయ్యాయి.
కుటుంబ సభ్యులే సమస్యకు కారణమా?
ప్రముఖ సిద్ధాంతి చేసిన వ్యాఖ్యల్లో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, జగన్‌కు సమస్య కుటుంబంలోని ఓ మహిళ ద్వారానే ఏర్పడుతుందని చెప్పారు. దీంతో పలువురు ఈ వ్యాఖ్యలను షర్మిళ, విజయమ్మ, సునీతలతో అనుసంధానిస్తూ చర్చించుకుంటున్నారు.
షర్మిళ పేరు తొలి స్థానంలో
జగన్‌కు సమస్య తలెత్తించబోయే మహిళ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. అందులో మొదటి పేరు వైఎస్ షర్మిళదే. గతంలో తెలంగాణలో పార్టీ స్థాపించి జగన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన ఆమె, ఇటీవల ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. కుటుంబ ఆస్తుల వివాదం, రాజకీయ వ్యతిరేకత కారణంగా ఆమె పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
వివేకా కుమార్తె సునీత?
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఆమె తన తండ్రి హత్య కేసులో నేరుగా జగన్‌ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇంకా కోర్టులో కొనసాగుతుండటంతో, ఆమె ద్వారా జగన్‌కు మరిన్ని సమస్యలు తలెత్తవచ్చని అంచనా వేస్తున్నారు.
భారతి రెడ్డి కారణమయ్యే అవకాశం లేదన్న అంచనా
జగన్ భార్య భారతీ రెడ్డి కూడా ఓ ప్రధాన మహిళా సభ్యురాలే అయినప్పటికీ, ఆమెతో ఎలాంటి విభేదాలు లేవు. గతంలో ఆమె జగన్‌ను విదేశాలకు వెళ్లిపోదామని సూచించారని కొన్ని వర్గాలు చెబుతున్నప్పటికీ, రాజకీయంగా ఆమె కారణంగా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు.
షర్మిల వైపు మొగ్గు చూపిన తల్లి
వైఎస్ విజయమ్మ ఇటీవల తన కుమార్తె వైపు మొగ్గు చూపుతూ, ఆమెకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో విజయమ్మ రాసిన బహిరంగ లేఖపై వైసీపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కుటుంబ ఆస్తుల విషయంలో కూడా ఆమె షర్మిళకు మద్దతుగా నిలవడం జగన్‌కు ఒక సమస్యగా మారిందని భావిస్తున్నారు.
కుటుంబంలోని మహిళ ఎవరు?
జగన్ రాజకీయంగా ఎంతోమంది మహిళలకు ప్రయోజనం కలిగించే పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ, కుటుంబంలోని ఓ మహిళ వల్ల ఆయనకు ఇబ్బందులు వస్తాయని చెప్పడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పంచాంగంలో పేర్కొన్న ఈ అంశం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.