వాషింగ్టన్: మార్క్ విలియమ్ కాలవే, ఈ పేరు అంటే ఎవరో తెలియదు. అయితే అండర్ టేకర్ అంటే తెలియని వాళ్లు మాత్రం ఉండరు. కొందరు ముద్దుగా తనని డెడ్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. మరీ ముఖ్యంగా ‘90ల్లో పుట్టిన తరానికి, అందునా రెజ్లింగ్ ఇష్టంగా చూసేవారికి ఇది మాత్రం చాలా సుపరిచితమైన పేరు.
అండర్ టేకర్ కు అతీత శక్తులుంటాయని, ఏడు జన్మలున్నాయని పిల్లల సర్కిల్లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తుండేవి. కెరీర్‌లో బరిలోకి దిగిన మ్యాచుల్లో 70 శాతం విజయాలతో వల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యుడబ్ల్యుఈ) లోనే ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో నిలిచాడు. చీకట్లో చర్చి గంట శబ్దంతో, నీలి మెరుపులతో, నిప్పురవ్వలతో రింగులోకి వచ్చే తీరుతోనే ప్రత్యర్థిని బెదరగొట్టి అక్కడే సగం గెలిచేస్తాడు టేకర్.
మిగతా ఆటగాళ్ళు బలమైన ప్రత్యర్థి చేతిలో చావుదెబ్బలు తిని పడిపోతే ఇక అతని పని ముగిసినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా లేచి నిలబడతాడు. రెట్టించిన శక్తితో ప్రత్యర్థిపై విరుచుకుపడి మ్యాచ్ గెలుస్తాడు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పేశాడు ఈ లెజెండ్.
అండర్ టేకర్ ఆదివారం సర్వైవర్ సిరీస్‌లో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఫేర్వెల్ మ్యాచ్ సందర్భంగా డబ్ల్యుడబ్ల్యుఈ సీయీవో విన్సెంట్ మెక్‌మహోన్ రింగు మధ్యలోకి వచ్చి అండర్ టేకర్ రాకను ఘనంగా ప్రకటించాడు. ఆ సమయంలో భావోద్వేగానికి గురైన మెక్‌మహోన్ ‘‘30 ఏళ్లుగా అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్న ఒక కెరీర్ ముగిసిపోబోతుంది. ఏదీ శాశ్వతం కాదంటారు చాలామంది. కానీ నా వరకూ అది అబద్ధం. రెజ్లింగ్‌పై టేకర్ వేసిన ముద్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచుంటుంది అన్నారు.
‘‘మనం ఏదైనా సాధించినప్పుడు కేరింతలు, ఒవేషన్ రూపంలో ప్రేక్షకుల నుంచి తిరిగొచ్చే శక్తి ఇంకెక్కడా దొరకదు. బహుశా కొందరు (‘ది రాక్’ లాంటివారు) రిటైరైన తర్వాత కూడా రీ ఎంట్రీ ఇస్తుంటారు. నా వరకు రెజ్లింగ్ అనేది అత్యుత్తమ క్రీడ. ప్రేక్షకులు ప్రత్యక్షంగా సినిమా చూస్తున్న అనుభూతికి లోనవుతారిక్కడ. ఆటగాళ్లలో ఉండే ఎమోషన్ కూడా చాలా ఎక్కువే. అదే సమయంలో కొన్ని హద్దులు దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది అన్నారు.