న్యూ ఢిల్లీ: కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలు బయట తిరగడం తగ్గిన నేపథ్యంలో పట్టణాల్లో నిరుద్యోగిత రేటు అంతకంతకు పెరుగుతోంది. పల్లెలతో పోల్చుకుంటె పట్టణాలలో లాక్ డౌన్ నిభంధనలు కఠినంగా అమలు జరుగుతోంది. తద్వారా దినసరి కూలీలు, చిన్న చిన ఉద్యోగాలు, హోటల్స్ లో పనిచేసే వారికి ఉపాధి లేకుండా పోయింది.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) నిర్వహించిన ఒక అధ్యయనం ఇచ్చిన నివేదీక ప్రకారం నిరుద్యోగ శాతం 11.26 కి ఎగబాకింది. గత నెల రోజుల నుండి జరిగిన అధ్యయనం ప్రకారం 10.26 నుండి 11.26 కి నిరుద్యోగిత రేటు పెరిగిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిరుద్యోగ రేటు అధికంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం లో ఎక్కువగా ఉంది. లాక్ డౌన్ వల్ల మార్కెట్లో పనులు లేక పోవడం, కూలీ పనులు, చిన్న పరిశ్రమలు నడవకపోవడం నిరుద్యోగ శాతం పెరుగుదలకు ఊతం ఇస్తోంది.
ఏప్రిల్ నుండి మే నెలలో ఉద్యోగాలు కోల్పోయిన సంఖ్య 17.7 మిలియన్ల నుండి 17.8 కి చేరింది. జూన్ నెలలో తిరిగి ఉద్యోగాలలో చేరిన వారి సంఖ్య 3.9 మిలియన్ గా ఉంది. ఈ నివేదిక సీఎం ఐఈ తన వెబ్ సైట్ లో ప్రకటించింది.
ఆల్ ఇండియా మ్యానుఫాక్చర్స్ ఆర్గనైజేషన్ మాజీ అధ్యక్షుడు కెఈ రఘునాథన్ ఒక ప్రకటనలో పేర్కొన్న ప్రకారం వలస కార్మికులు తిరిగి పట్టణాల బాట పట్టేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని, ఫార్మల్ సెక్టార్ కోలుకోవడానికి మరి కొంత సమయం పడుతుందన్నారు.
అయితే లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చిన తరువాత ఆర్థిక లావాదేవీలు కాస్త ఊపందుకున్నాయి. ఇప్పుడు వృత్తి నిపుణులు, కార్మికులు, అసంఘటిత రంగాల కార్మికులు, కూలీలు ఇతర వర్గాల వారికి కొద్ది కొదిగా పనులు దొరకడం ప్రారంభించాయి. హోటల్, రెస్టారెంట్లు, ఇతర రంగాలలో కార్మికులకు ఇప్పట్లో అవకాశాలు దొరకకపోవచ్చు.