ములుగు, వరంగల్ : వరంగల్ లోని ములుగు గ్రామంలో ఒక వింతవ్యాధి ఆ గ్రామాన్ని కబలిస్తోంది. వరుసగా జరుగుతున్న మరణాలు ఆ గ్రామస్తులకు కంటికి నిద్ర లేకుండా భయపెడుతున్నాయి. కేవలం 20 రోజుల వ్యవధిలో ఆరుగురు ఈ వ్యాధికి బలయ్యారు. దీన్ని చూసి ఆ గ్రామస్థులు తమ గ్రామానికి ఎవరో చేతబడి చేశారని ఆందోళన చెందుతూ, అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వణికిపోతున్నారు.
చాలా మంది తమ ప్రాణాలు పోతాయనే భయంతో ఊరు వదిలి వలస వెళ్ళిపోతున్నారు. వారిని బలి తీసుకుంటున్న ఆ వ్యాధి ఏంటి అనేది అక్కడి వైద్యులకు కూడా అంతు చిక్కడం లేదు. ఇది ములుగు కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామం. వరంగల్‌కు 145 కి.మీ దూరంలో, ములుగు జిల్లా కేంద్రానికి 95కి.మీ దూరంలో వుండే ఏటూరు నాగారం ఏజెన్సీలోని ఓ మారుమూల గ్రామం ఇది. ఈ కుగ్రామం గత 20 రోజులుగా మృత్యు భయంతో బెంబేలెత్తిపోతోంది.
ఇప్పుడు ఈ గ్రామంలో ఏ ఒక్కరికి కంటిమీద కునుకు లేదు. ఏ ఇంట్లో అలికిడి అయినా ఏదో జరిగి పోతుందనే ఆందోళన అందరినీ వెంటాడుతుంది. వారికి కడుపునొప్పి జ్వరంవస్తే చాలు, ఇక చావు తప్పదని ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం గత 20 రోజుల్లో ఈ గ్రామానికి చెందిన ఆరుగురు వరుసగా చనిపోవడమే. వాళ్లకు కడుపునొప్పి వచ్చిన కొద్దిసేపటికే కడుపంతా ఉబ్బి రక్తంతో వాంతులు చేసుకొని కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు.
ఈ గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అంతుచిక్కని వింత వ్యాధి వారి ప్రాణాలు మింగేస్తుండడంతో ఊరంతా ప్రాణభయంతో ఊరి విడిచి వలసబాట పట్టారు. ఇప్పటికే 40కి పైగా కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్ళు, ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో ఏ ఇంటికి చూసినా ఇలా తాళాలు వేలాడుతున్నాయి.
స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే మకాంవేసి మరోచావు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వరుస మరణాల నేపథ్యంలో మూఢనమ్మకాల వైపు అడుగులు వేస్తున్నారు. కచ్చితంగా ఏదో శక్తి ఆవహించిందని, చేతబడి చేశారని గ్రామమంతా ఆందోళన చెందుతుండడంతో స్థానిక సర్పంచ్ కూడా అయోమయంలో చిక్కుకున్నారు. ఎప్పుడు ఎవరు బలవుతారో అర్థంకాక వీరంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భీతిల్లుతున్నారు.