న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం కేంద్రం మరియు రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆనవాయితీ. వాటిని ప్రింట్ తీసి రకరకాల పెట్టెల్లో, ఫైల్లలో తీసుకు వచ్చి సమావేశాల్లో ప్రవేశ పెడతారు. కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రతులను పార్లమెంట్ సభ్యులకు డిజిటల్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కోవిడ్ ప్రొటోకాల్ దృష్ట్యా పార్లమెంట్ సభ్యులకు ఈసారి బడ్జెట్ ముద్రిత ప్రతుల పంపిణీ ఉండదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరం(2021–22) బడ్జెట్ కాపీలను కోవిడ్–19 వ్యాప్తి ప్రమాదం దృష్ట్యా ముద్రించడానికి బదులు ఎలక్ట్రానిక్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇలాంటి పరిణామం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే ప్రథమం.
స్వతంత్య్ర భారతావనిలో తొలి సారిగా దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.7% పడిపోయిన నేపథ్యంలో ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. కరోనా మహమ్మారితో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు వృద్ధి రేటును పెంచే చర్యలకు అధిక ప్రాధాన్యమిస్తారని భావిస్తున్నారు.
ఆర్థిక బిల్లుతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల పద్దు, కొత్తగా విధించే పన్నులు, ఇతర చర్యల వివరాలుండే ముద్రణ ప్రతులను పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో సభ్యులకు అందజేయడం సాధారణంగా జరిగే ఆనవాయితీ. ఈ ఆర్థిక బిల్లులో దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను తెలిపే వివరాలుంటాయి. భారీ సంఖ్యలో ఉండే ఈ పత్రాలన్నిటినీ పార్లమెంట్ సభ్యులకు అందజేస్తారు. ముద్రణకు ఆరంభ సూచికగా హల్వా పేరుతో వేడుక కూడా జరుగుతుంది.