అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాలకు ఎటువంటి అంతరాయం లేని మరియు అపరిమితమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ఒక కొత్త నెట్‌వర్క్ వ్యవస్థ ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రతి గ్రామంలో నెట్‌వర్క్ పాయింట్ నుంచి ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని, వినియోగదారులు ఏ సామర్థ్యం కనెక్షన్ కావాలన్నా ఇచ్చే విధంగ వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు, అమ్మ ఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల పంపిణీపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే ఏడాది ‘అమ్మ ఒడి’ చెల్లింపుల నాటికి కోరుకున్న వారికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలన్నారు. ప్రతి గ్రామానికీ అన్ లిమిటెడ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఇంటర్‌నెట్ కేబుల్స్ తెగిపోయి, అవాంతరాలు వచ్చే పరిస్థితి ఉండకూడదని, అలాంటి సమస్యలను అధిగమించేలా ఆ వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. ‘వైఎస్సార్ జగనన్న కాలనీల్లోకి కూడా ఇంటర్నెట్ నెట్‌వర్క్ తీసుకు రావాలి. ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలి. హెచ్‌టి లైన్ నుంచి సబ్‌స్టేషన్ వరకు, సబ్‌స్టేషన్ నుంచి పంచాయతీల వరకు అండర్ గ్రౌండ్ కేబుల్ తీసుకెళ్లే ఆలోచనతో ముందుకు సాగాలి.
గ్రామ పంచాయతీ వరకు అన్ లిమిటెడ్ నెట్‌వర్క్‌ను తీసుకెళ్లాలి’ అని చెప్పారు. ఈ సమీక్షలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్.శ్రీకాంత్, ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఛైర్మన్ పి.గౌతంరెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఎండీ ఎం.మధుసూదన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.