న్యూఢిల్లీ: ప్రస్తుతం నడుస్తున్న అన్‌లాక్ 2.0 జూలై 31న ముగుస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్–19 ఆంక్షల్ని మరింత సడలించడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు అన్‌లాక్ 3.0 మార్గదర్శకాల రూపకల్పనలో నిమగ్నమైంది. సినిమాహాళ్లు, జిమ్‌లు తెరిచేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి.
థియేటర్ లో సగం సీటింగ్ సామర్థ్యం వరకు అనుమతించే విధంగా, శానిటైజేషన్‌కి వీలుగా రెండు షోల మధ్య సుదీర్ఘ విరామం లాంటి జాగ్రత్తలతో థియేటర్లను ప్రారంభించడానికి యజమానులు సుముఖంగా ఉన్నారు. అయితే సీట్ల మధ్య భౌతిక దూరం పాటించడం, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తొలుత 25% సీటింగ్‌తో థియేటర్లు ప్రారంభించేందుకు అనుమతించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ హోంశాఖకు సూచించింది.
ఎయిర్ కండీషనింగ్ థియేటర్లలో తలుపులన్నీ మూసి ఉండడం వల్ల ప్రేక్షకుల్లో ఎవరికైనా కరోనా ఉంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్న వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల్ని అంచనా వేసి అక్కడ ప్రభుత్వాలే థియేటర్లు, జిమ్‌లు తెరవడానికి అనుమతి ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు భావిస్తున్నారు. అన్‌లాక్ 3.0 సడలింపులను ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చేలా కేంద్ర హోంశాఖ సన్నాహాలు చేస్తోంది.
సినిమా థియేటర్లు, జిమ్‌లను కేవలం 25 శాతం సీటింగ్ సామర్థ్యంతో మాత్రమే అనుమతించే విధంగా కేంద్ర సమాచార ప్రసారశాఖ హోంశాఖకు ప్రతిపాదనలు అందచేసింది. థియేటర్ల యజమానులతో చర్చించి కేంద్ర సమాచారశాఖ వీటిని రూపొందించింది. థియేటర్లలో విశ్రాంతి సమయంలో ఫలహారశాలల మధ్య క్యూలను నివారించడం ద్వారా చిత్ర ప్రదర్శనను ఆహ్లాదకరంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని యజమానులు విన్నవిస్తున్నారు.
సుదీర్ఘ విరామం తరువాత జిమ్‌లు తెరించేందుకు అనుమతించాలని కేంద్రం అనుకున్నప్పటికీ అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సందిగ్ధం నెలకొంది. మాస్కులు ధరించి ఎక్సర్‌సైజులు చేయడం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అన్‌లాక్ 3.0లో పాఠశాలలు, మెట్రో రైళ్లను అనుమతించే అవకాశాలు దాదాపుగా లేవు. భౌతిక దూరం పాటించడం మెట్రో రైళ్లలో సాధ్యం కాదు కాబట్టి ప్రస్తుతం వాటిని నడిపే ఆలోచన చేయడం లేదు. ఇక పాఠశాలలకు సంబంధించి యాజమాన్యాలు, తల్లిదండ్రులతో కేంద్ర మానవ వనరుల శాఖ పలు దఫాలు సంప్రదింపులు జరిపింది. తల్లిదండ్రులెవరూ ఇప్పట్లో స్కూళ్లు తెరవడానికి సుముఖంగా లేరని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం పాఠశాలలను పునఃప్రారంభించేందుకు అనుమతించే అవకాశం ఉండదని సమాచారం.
అయితే సామాన్య ప్రజలు ఈ అన్ లాక్ 3.0 విడుదల చేసిన తరువాత ఎంత వరకు సినిమా థియాటర్లకు వెళ్తారు అన్నది పెద్ద ప్రశ్న. ఇప్పటికే రోజుకు వేల కేసులు వస్తున్న నేపథ్యంలో ఈ అన్ లాక్ 3.0 కేసులను మరింతగా పెరగడానికి ఊతం అవుతుందే తప్ప ఇది ఎంత వరకు ప్రజలకు, యాజమాన్యాలకు, ప్రభుత్వానికి ఉపకరిస్తుందనేది అన్ లాక్ 3.0 మొదలైన తరువాత కేసుల సంఖ్యని బట్టి విశ్లేషించగలమని నిపుణులు భావిస్తున్నారు.
unlock3.0 allow cinema theatres gym || unlock3.0 allow cinema theatres gym