అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ప్రవేశ పెట్టీన గ్రామ/వార్డు సచివాలయాల సేవలు ఐరాస దృష్టికి వచ్చాయి. దాదాపు ఏడాది క్రితం పక్షపాతం, మధ్యవర్తుల ప్రమేయం, అవినీతికి తావులేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను అట్టడుగు స్థాయిలో ప్రజలందరికీ సమానంగా అందజేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఐక్యరాజ్య సమితి(ఐరాస) దృష్టిని ఎంతగాణో ఆకర్షించింది.
సచివాలయ సేవలకు సహకారం అందించేందుకు ఐరాస అనుబంధ విభాగాలు ముందుకొచ్చాయి. దీనిపై సోమవారం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో 500 కు పైగా సేవలు అందించబడుతున్నాయి. సచివాలయాలలో కరెంట్ బిల్లులు చెల్లింపు వంటి పలు సేవలను కూడా నగదు రహితంగా నిర్వహించే వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రారంభం కానున్నాయి.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో కుగ్రామాల్లో ఉండే సచివాలయాల్లో సైతం డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చినట్టు అవుతుందని, దీని వల్ల మన రాష్ట్రంలో మరో సాంకేతిక విప్లవం వచ్చినట్టేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
మొబైల్ ద్వారా అత్యంత సులభంగా, సురక్షితంగా, తక్షణమే చెల్లింపు ప్రక్రియ జరిపేలా ప్రతి సచివాలయానికి క్యూఆర్ కోడ్‌ను కేటాయించనున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ), కెనరా బ్యాంక్‌ల సహకారంతో సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 543 రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారులు ఇక నుంచి ఈ సేవలను అవసరమైతే డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. సచివాలయాల్లో ప్రతి నగదు రహిత లావాదేవీ జరిగిన వెంటనే సంబంధిత వినియోగదారుడి మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది.