అంతర్జాతీయం: హూతీలపై విరుచుకుపడ్డ అమెరికా దళాలు – 31 మంది మృతి!
యెమెన్‌లో వ్యూహాత్మక దాడులు
అమెరికా (USA) సైన్యం యెమెన్ (Yemen)లో హూతీ తిరుగుబాటుదారులపై భారీ వైమానిక దాడులు చేపట్టింది. సనా (Sanaa), సదా (Saada), అల్ బైదా (Al Bayda), రాడా (Rada) ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. హూతీ ఆరోగ్య మంత్రిత్వశాఖ (Houthi Health Ministry) ప్రకారం, ఈ దాడుల్లో 31 మంది మృతి చెందగా, 101 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారుల సంఖ్య అధికంగా ఉందని తెలిపింది.
హూతీ దాడులకు అమెరికా ప్రతిస్పందన
అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) ప్రకటన ప్రకారం, హూతీల దాడులు కొనసాగితే మరింత తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. అమెరికా నౌకలు, యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని అస్సలు సహించబోమని హెచ్చరించింది.
హూతీలపై ట్రంప్ ఘాటుగా స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ మధ్య కాలంలో పెరుగుతోన్న హూతీల దాడులను తీవ్రంగా ఖండించారు. “హూతీలు, మీ సమయం ముగిసింది. వెంటనే దాడులు ఆపండి, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ట్రూత్ సోషల్ (Truth Social) ద్వారా హెచ్చరించారు. ప్రపంచ జలమార్గాల్లో (Maritime Routes) అమెరికా వాణిజ్య, యుద్ధ నౌకలను ఎవరూ అడ్డుకోవాలని ప్రయత్నించలేరని స్పష్టం చేశారు.
ఇరాన్‌పై అమెరికా ఆగ్రహం
హూతీలకు మద్దతు ఇస్తోన్న ఇరాన్ (Iran) తక్షణమే వెనక్కి తగ్గాలని అమెరికా హెచ్చరించింది. హూతీల దాడులకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. యెమెన్‌లో హూతీలకు ఆయుధాలు, ఆర్థిక సహాయం అందజేస్తోన్న ఇరాన్ మద్దతుదారులను లక్ష్యంగా దాడులు ముమ్మరం చేయనున్నట్లు అమెరికా బహిరంగంగా వెల్లడించింది.