అమెరికా: అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఈసారి రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోటీలో ఉన్నారు. గతంలో అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ట్రంప్, మరోసారి అధ్యక్ష పీఠం సాధించాలని పట్టుదలతో ఉన్నారు.
తొలిసారి అధ్యక్ష బరిలోకి దిగిన హారిస్ కూడా ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇటీవలి సర్వేలు చూపినట్లు, ఇరువురు సమాన శాతం ఓటర్ల మద్దతుతో నిలిచారు. ముఖ్యమైన స్వింగ్ రాష్ట్రాల్లోనూ పోటీ తీవ్రంగా ఉండటం ఫలితంపై తర్జనభర్జనకు దారితీస్తోంది.
ప్రముఖ సంస్థలైన సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ నిర్వహించిన సర్వేలు కూడా ఈ ఉత్కంఠను ఇస్తున్నాయి. ఫైనాన్షియల్ టైమ్స్, మిషిగన్ యూనివర్శిటీ సర్వేల్లోనూ ట్రంప్, హారిస్ మధ్య తేడా చాలా తక్కువగా ఉంది.
ఈ తుది ప్రచారంలో హారిస్ మహిళల హక్కులపై దృష్టి పెట్టగా, ట్రంప్ అక్రమ వలసల అంశాన్ని ఉత్కంఠభరితంగా ప్రస్తావిస్తున్నారు. జార్జియా, మిషిగన్, ఆరిజోనా వంటి కీలక రాష్ట్రాల్లో ఇరువురి మధ్య పోటీ పోటాపోటీగా ఉండటంతో ఈ ఎన్నికల ఫలితం మరింత ఉత్కంఠ రేపుతోంది.