వాషింగ్టన్: ఇరుగు పొరుగు దేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాలలో మా మిత్ర దేశాలకు ఎల్లప్పుడూ తమ నుంచి మద్దతు లభిస్తుందని, అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చింది.
అలానే, భారత్ మైయు చైనా దేశ సరిహద్దులలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని నిశితంగా చూస్తున్నామని, ప్రతిష్టంభనకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని రెండు దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, చైనా దేశ వ్యవహారశైలి పట్ల తమ వైఖరిని తెలియజేశారు.
‘‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో పొరుగు దేశాలతో చైనా బెదిరింపు ధోరణి తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా తయరయ్యింది. అమెరికా స్నేహితులకు ఎల్లప్పుడూ మేం అండగానే ఉంటాం. మా భాగస్వాములతో మేము కలిసి పనిచేస్తాం. భద్రతాపరమైన విషయాల్లో పరస్పర సమాచార మార్పిడితో మిత్ర దేశాలకు సహకారం కూడా అందిస్తాం. అలాగే ప్రస్తుత భారత్ మరియు చైనా సరిహద్దులో నెలకొన్న వివాదాలను మేం నిశితంగా పరిశీలిస్తున్నాం. చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని మేం ఆశిస్తున్నాం’’ అని నెస్ ప్రైడ్ పేర్కొన్నారు.
ఇక అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, భారత విదేశీ వ్యవహారా మంత్రి ఎస్ జైశంకర్ మధ్య జరిగిన సంభాషణ గురించి స్పందిస్తూ, అమెరికా- భారత్ మధ్య దౌత్య సంబంధాలు మరింత బలపడేలా చర్యలు తీసుకుంటున్నామని నైస్ ప్రైడ్ తెలిపారు. అత్యున్నతస్థాయి చర్చల ద్వారా వివిధ అంశాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేలా సానుకూల వాతావరణ నెలకొంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.