న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా విజృంభించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఒక వారం రోజుల నుండి కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పట్టాయి. కాగా కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అవడంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో అందరికి వ్యాక్సినేషన్ వేయడంపై దృష్టిపెట్టింది.
దేశంలో అందరికీ టీకా కార్యక్రమానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 21లోపు రెండు వారాల పాటు ఈ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తెలిపింది. రాష్ట్ర జనాభా మరియు యాక్టివ్ కరోనా కేసులను బట్టి టీకాలు కేటాయిస్తాయమని వెల్లడించింది. టీకాల వృథాను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపుల్లో కోత విధిస్తామని కేంద్రం పేర్కొంది.
అలాగే అన్ని ఆస్పత్రులకు సమానంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించింది. ప్రైవేట్ ఆస్పత్రులకు కావాల్సిన డోసుల వివరాలను సంబంధిత రాష్ట్రాలే ఇవ్వాలని తెలిపింది. పేదలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా వేయించుకోవడం కోసం ఈ-వోచర్లు ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొంది.
కాగా కోవిడ్-19 వ్యాక్సిన్ల సేకరణ, వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.