న్యూఢిల్లీ: దేశంలో ప్రబలిన కోవిడ్ కు విరుగుడుగా భారీ స్థాయిలో చేపట్టనున్న కోవిడ్–19 టీకాల కార్యక్రమంలో మొబైల్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు. అనేక రెట్లు వేగవంతమైన డేటా సర్వీసులను అందించగలిగే 5జీ మొబైల్ నెట్‌వర్క్‌ను సత్వరం అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.
దీన్ని సాధించడం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాలు తెలిపారు. ‘కోట్ల మందికి కోట్ల కొద్దీ రూపాయల ప్రయోజనాలను చేకూర్చేందుకు మొబైల్ టెక్నాలజీ తోడ్పడుతోంది. అసంఖ్యాకంగా నగదు రహిత లావాదేవీల నిర్వహణకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది.
ఇప్పుడు ఈ టెక్నాలజీ తోడ్పాటుతోనే ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో కోవిడ్–19 టీకాలను వేసే కార్యక్రమాన్ని మేము చేపట్టనున్నాం‘ అని మోడీ ప్రకటించారు. అయితే, టీకాలు వేయడంలో మొబైల్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించనున్నారన్న వివరాలను ఆయన వివరంగా వెల్లడించలేదు. ఇక టెలికం పరికరాలు, డిజైన్, అభివృద్ధి, తయారీకి భారత్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అంతా కలిసి పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
భారత దేశంలో దేశీయంగా టెలికం పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు ఇప్పటికే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టామని, మొబైల్స్ తయారీకి కూడా కీలకమైన దేశాల్లో ఒకటిగా భారత్ ఎదుగుతోందని ఆయన తెలిపారు.
దేశంలోని అన్ని మారుమూల గ్రామాలకు కూడా మూడేళ్లలో అత్యంత వేగవంతమైన ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీని అందించడానికి ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని తెలిపారు. టెక్నాలజీ అప్‌గ్రేడ్ అయ్యే కొద్దీ హ్యాండ్‌సెట్స్, గ్యాడ్జెట్స్‌ను తరచూ మార్చేసే సంస్కృతి కూడా పెరుగుతోందని, ఇలాంటి ఎల్రక్టానిక్ వ్యర్థాల నిర్వహణకు పరిశ్రమ ప్రత్యేక టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేయడంపై కూడా దృష్టి సారించాలని ఆయన సూచించారు.