న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి అత్యవసరంగా ప్రసంగించారు. భారత దేశంలో 15 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్నవారికి వచ్చే ఏడాది జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టాలని నిర్ణయించినట్లు తన ప్రసంగంలో ప్రకటించారు.
అంతేకాకుండా జనవరి 10వ తేదీ నుంచి హెల్త్‌కేర్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందు జాగ్రత్త కోసం మరో డోసు( ప్రికాషన్ డోస్– రెండు డోసులు తీసుకున్నవారికి ఇచ్చే మూడో డోసు) ఇవ్వనున్నట్లు తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్రిస్మస్ పండుగ మరియు మాజీ ప్రధాని వాజ్‌పేయ్ జన్మదినం సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తమ పిల్లలను కళాశాలలు మరియు పాఠశాలలకు పంపే తల్లిదండ్రులకు తమ నిర్ణయం భరోసానిస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలంతా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు.
అలాగే దాని తరువాత డాక్టర్ల సలహా మేరకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 సంవత్సరాలకు పైబడినవారికి కూడా అదనపు డోసును ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా తన ప్రసంగంలో ఆయన బూస్టర్ డోస్ అనే పదాన్ని వినియోగించకుండా ప్రికాషనరీ డోస్ అని మాత్రమే చెప్పారు.
కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ అత్యంత కీలకంగా ఆయన అభివర్ణించారు. త్వరలో ముక్కు ద్వారా ఇచ్చే టీకా, ప్రపంచ తొలి డీఎన్ఏ ఆధారిత టీకాలు భారత్‌లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కరోనాపై పోరులో దేశీయ శాస్త్రవేత్తల కృషిని మోదీ కొనియాడారు.