హైదరాబాద్: ప్రపంచ మానవాళిని గడగడలాడించిన కరోనా వైరస్ ను నిరోధించే వ్యాక్సిన్ ఎవరెవరికి ఇవ్వాలో పేర్లతో జాబితా తయారు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లతో పాటు మొత్తం సిబ్బంది పేర్లతో ఆ జాబితా తయారు చేయాలని జిల్లా వైద్యాధికారుల (డీఎంహెచ్‌వో)ను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కరుణ ఆదేశించారు.
దీనికి సంబంధించి మంగళవారం అత్యవసర ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 31 నాటికి జాబితా తయారు చేసి కేంద్ర అధికారిక పోర్టల్‌లో పేర్లు నమోదు చేయాలని ఆదేశించారు. ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితరులకు తొలిగా వ్యాక్సిన్ వేస్తారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా వ్యాక్సిన్ వేస్తారు.
వారి పేర్లనూ జాబితాలో చేర్చుతారు. కాబట్టి ఫార్మాట్ ప్రకారం వారి పేర్లు, పనిచేసే ఆస్పత్రి పేరు లేదా పని చేసే ప్రాంతం, మండలం, జిల్లా వంటి వివరాలతో జాబితా తయారు చేస్తారు. వారిలో ఎవరికైనా ఇప్పటివరకు కరోనా సోకిందా? ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా? తదితర వివరాలను కూడా పంపిస్తారు. అందుకు సంబంధించిన ఫార్మాట్‌ను డీఎంహెచ్‌వోలకు పంపించారు. వ్యాక్సిన్ వస్తే ముందుగా ఎంత మందికి వేయాల్సి ఉంటుందన్న దానిపై కేంద్రం ఓ అంచనాకు రానుంది.