ప్రస్తుతం కరోనా వైరస్ అన్ని దేశాల్లో విజృంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు జనాభా లెక్కల లాగా పెరుగుతున్నాయి. మన దేశంలోనూ లొక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి చేజారినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు ఐదు లక్షలకు కరోనా కేసులు చేరుకున్నాయి.రోజు రోజుకి కరోనా ప్రభావం పెరుగుతూ పోతోంది. సింగల్ డిజిట్ కేసులు ఉన్నప్పుడు తీసుకున్న జాగ్రత్తలు లక్షల్లో కేసులు వచ్చాక జనాలు మరిచారు. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు ఇప్పుడప్పుడే ప్రారంభించే అవకాశాలు కనపడట్లేదు. ఇప్పటికే చాలా స్కూల్స్ ఆన్ లైన్ క్లాసెస్ మొదలుపెట్టాయి. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి కూడా ఆన్ లైన్ క్లాసెస్ మొదలుపెట్టడం వలన కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ చాలా విద్యాసంస్థలు ఆన్ లైన్ భోదన ప్రారంభించాయి.
తొలిప్రేమ, మజ్ను సినిమాలు తీసిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ విషయం పైన తన స్నేహితులకి జరిగిన సంఘటనల గురించి ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు. ‘నా స్నేహితుల్లో చాలా మంది స్కూల్ ఫీజులు పెరగడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ క్లాసుల పేరిట డబ్బు దోచుకుంటున్నారు. మూడు, నాలుగేళ్ల పిల్లలకు డబ్బును లాగుతున్నారు. మరి కొన్ని స్కూల్స్ అయితే బస్ ఫీజులు కూడా తీసుకుంటున్నాయట. అదే నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి క్రైసిస్‌లో కూడా లాభాలను ఆర్జించాలని కొందరు ఇలా చేస్తున్నారు. దేవుడే మమ్మల్ని రక్షించాలి’ అని పేర్కొన్నాడు. వెంకీ అట్లూరి ప్రస్తుతం నితిన్-కీర్తి సురేష్ కాంబోలో వస్తున్న రంగ్ దే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.