మెక్సికో: విశ్వ సుందరి: మిస్ యూనివర్స్ పోటీల్లో డెన్మార్క్ అందాల భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ తన సత్తా చాటారు. 125 మంది పాల్గొన్న ఈ పోటీల్లో విక్టోరియా 21 ఏళ్ల వయసులోనే విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు.
తుది రౌండ్‌లో నైజీరియా, మెక్సికో భామలతో తలపడి విజేతగా నిలిచారు. గత ఏడాది మిస్ యూనివర్స్ విజేత షెన్నిస్ పలాసియోస్ విక్టోరియాకు కిరీటాన్ని అందజేశారు.
విక్టోరియా కెజార్ డెన్మార్క్ తరఫున విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్న తొలి మహిళ. ఆమె గతంలో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో టాప్ 20లో నిలిచి గుర్తింపు పొందారు.
బిజినెస్, మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన విక్టోరియా, మోడలింగ్‌తో పాటు డ్యాన్స్‌లో నైపుణ్యం పొందారు. తాను గెలిచిన ఈ కిరీటాన్ని యువతకు ప్రేరణగా ఉపయోగిస్తానని ఆమె చెప్పారు.
తన వ్యక్తిగత ప్రయాణం మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్యం, మూగ జీవాల సంరక్షణ అంశాలపై శ్రద్ధ చూపిస్తూ విక్టోరియా ఆదర్శంగా నిలిచారు. ఈ విజయం ద్వారా డెన్మార్క్ ప్రజలు గర్వపడుతున్నారు. పోటీ నిర్వాహకులు ఆమె ప్రదర్శనను మహిళా సాధికారతకు స్ఫూర్తిగా పేర్కొన్నారు.