fbpx
Wednesday, February 5, 2025
HomeNationalకర్ణాటక హైకోర్టు మెట్లెక్కిన విజయ్ మాల్యా

కర్ణాటక హైకోర్టు మెట్లెక్కిన విజయ్ మాల్యా

VIJAY MALLYA MOVES KARNATAKA HIGH COURT

జాతీయం: కర్ణాటక హైకోర్టు మెట్లెక్కిన విజయ్ మాల్యా

వందల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసం కేసులో ప్రధాన నిందితుడైన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను చెల్లించిన రికవరీల వివరాలను పూర్తిస్థాయిలో అందించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

మాల్యా తన పిటిషన్‌లో, తాను తీసుకున్న రుణాల కంటే బ్యాంకులు మరింత ఎక్కువ మొత్తాన్ని వసూలు చేశాయని పేర్కొన్నారు. తాను బ్యాంకులకు ఎంత మొత్తం చెల్లించాడనే వివరాలను అధికారికంగా సమర్పించాలని కోరారు. ముఖ్యంగా యూబీహెచ్‌ఎల్ (యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్) సహా ఇతర సంస్థల నుంచి తీసుకున్న రుణాలను ఎలా రికవరీ చేశారో వివరాలు అందించాలని అభ్యర్థించారు.

న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.6,200 కోట్ల రుణం తీసుకున్నప్పటికీ, బ్యాంకులు ఇప్పటివరకు రూ.14,131 కోట్ల విలువైన ఆస్తులను రికవరీ చేశాయి అని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.

అంతేగాక, లోక్‌సభలో ఆర్థిక మంత్రి ఇచ్చిన ప్రకటన ప్రకారం, మాల్యా ఇప్పటికే రూ.10,200 కోట్లు చెల్లించాడని, అయినా రికవరీ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని న్యాయవాది అన్నారు. ఈ క్రమంలో రికవరీని నిలిపివేయాలని హైకోర్టును అభ్యర్థించారు.

న్యాయస్థానం ఈ వాదనలు పరిశీలించిన అనంతరం ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా 10 బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 13లోగా తగిన వివరాలతో కోర్టుకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఇకపోతే, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల మోసం కేసులో మాల్యా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2016లో భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన మాల్యాను తిరిగి రప్పించేందుకు భారత ప్రభుత్వం అనేక చట్టపరమైన చర్యలు చేపట్టింది.

మాల్యా హైకోర్టును ఆశ్రయించడం, బ్యాంకులకు నోటీసులు జారీ కావడం, రికవరీ ప్రక్రియపై కోర్టు నిర్ణయం తదుపరి చర్యలపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular