ఏపీ: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సాయిరెడ్డి ధోరణి అనూహ్యంగా మారడం, గతంలో వ్యక్తిగత విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తడం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది.
సాయిరెడ్డి పవన్‌ను పొగడటం వెనుక రాజకీయ వ్యూహాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు.
ముఖ్యంగా, ఇటీవల కాకినాడ పోర్టు వివాదం వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టడం, సీఐడీ విచారణలో సాయిరెడ్డి పేరు ప్రస్తావనకు రావడం దీని మూలకారణంగా భావిస్తున్నారు.
పవన్‌తో సానుకూలత ప్రదర్శించడం ద్వారా విచారణపై ప్రభావం చూపే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు.
ఇక సాయిరెడ్డి ధోరణి టీడీపీ-జనసేన కూటమి మధ్య చిచ్చు పెట్టాలని ఒక వ్యూహాత్మక కదలికగా కూడా చూడవచ్చు.
చంద్రబాబు-పవన్ కూటమి భవిష్యత్తులో వైసీపీకి పెద్ద రాజకీయ సవాలు కానుందని భావించిన సాయిరెడ్డి, పవన్‌ను ప్రశంసించడం ద్వారా ఈ కూటమిలో విభేదాలను రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.