ఏపీ: వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా విజయమ్మ ట్రైబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఆమె సరస్వతి పవర్ కార్పొరేషన్ వాటాలపై తనకు పూర్తి హక్కు ఉందని, జగన్ లేదా భారతి ఈ ఆస్తులతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
2012లో జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ, సీబీఐ ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గతంలో జగన్ తరఫున లాయర్లు ఈ ఆస్తుల నిర్వహణపై తమకు హక్కు ఉందని వాదించారు. కానీ విజయమ్మ తాజా ప్రకటన ఆ వాదనకు ఎదురుదెబ్బగా మారింది.
ఈ వివాదంలో షర్మిలను అనవసరంగా లాగుతున్నారని విజయమ్మ ఆక్షేపించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత ఆస్తుల అంశమేనని, కుటుంబ రాజకీయాలను ఇందులో ముడిపెట్టొద్దని పేర్కొన్నారు.
ఇప్పుడు ఈ వివాదంపై ట్రైబ్యునల్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. విజయమ్మ వాదన సబబు అనుకుంటే, జగన్‌కు ఆర్థికంగా దెబ్బ తగలొచ్చు. మొత్తానికి, వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.