నరసాపురం: మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో సీఐడీ విరమణ పొందిన ఏఎస్పీ విజయపాల్ పోలీసుల విచారణలో మళ్లీ డొంకతిరుగుడు సమాధానాలు ఇచ్చారు.
ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయనను దర్యాప్తు అధికారులు 11 గంటల నుంచి సాయంత్రం 5.45 వరకు ప్రశ్నించారు. కానీ, ఏ ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పకుండా “గుర్తులేదు,” “మర్చిపోయాను” వంటి సమాధానాలే ఇచ్చినట్టు సమాచారం.
వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం, కస్టడీలో చిత్రహింసలు, గాయాలకు సంబంధించిన ప్రశ్నలపై కూడా విజయపాల్ ఏవిధమైన స్పష్టత ఇవ్వలేదు.
“రఘురామను ఎందుకు కొట్టారు?”, “న్యాయమూర్తి ఎదుట ఎందుకు హాజరుపర్చలేదు?” వంటి ప్రశ్నలపై కూడా తాను ఏ తప్పూ చేయలేదని, తనకు తెలియదని అన్నారు.
గతంలో అక్టోబర్ 11న గుంటూరులో విచారణకు హాజరైనప్పుడు కూడా ఇలాంటి సమాధానాలే ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయపాల్ తీరుపై పోలీసు వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.
అసలు ఘటనపై స్పష్టత ఇవ్వకుండా తానేమీ చేయలేదనే తీరుతో విచారణను మరింత పర్యవేక్షణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.