ఢిల్లీ: వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి తన రాజకీయ జీవితం నుంచి విరమిస్తున్నట్లు శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.
శనివారం ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి, ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చారు. తన నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమేనని, ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు.
తన రాజీనామా విషయాన్ని ముందుగానే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న జగన్‌కు ఫోన్ ద్వారా వివరించి, తన నిర్ణయం చెప్పినట్లు వివరణ ఇచ్చారు.
జగన్ తన నిర్ణయాన్ని పునరాలోచన చేయమని చెప్పినప్పటికీ, విజయసాయిరెడ్డి తన నిర్ణయంపై నిలబడ్డారు. కాకినాడ సీ పోర్టు కేసు కారణంగానే రాజకీయాల నుంచి తప్పుకున్నారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
తనపై వచ్చిన ఆరోపణలు, మీడియా కథనాలపై తీవ్రంగా స్పందించిన సాయిరెడ్డి, వాటిని తప్పుడు ప్రచారంగా పేర్కొన్నారు. పరువు నష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు.
తన రాజకీయ ప్రయాణంలో ఎప్పుడూ వైఎస్ కుటుంబానికి ద్రోహం చేయలేదని, ఇకపైనా చేయబోనని తెలిపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి త్వరలోనే రాజీనామా చేస్తానని, ప్రస్తుతం వైసీపీ కార్యకర్తగానే కొనసాగుతానని చెప్పారు.