ముంబై: విమాన మరియు కింగ్ ఫిషర్ వ్యాపారాల్లో ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకుని ప్రస్తుతం పీకల్లోతు అప్పుల ఊబిలో పడ్డ లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఆస్తులు ఒక్కొక్కటిగా వేలానికి వస్తున్నాయి. వాటిలో ముంబైలో ఉన్న విజయ్ ఆల్యా యొక్క విలాసవంతమైన ఇంటిని హైదరాబాద్‌కి చెందిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ చేజిక్కించుకుంది.
కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీ ఎదుర్కొన్న వరుస నష్టాలతో మాల్యా ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులకు బాకీ పడ్డారు. అందువల్ల విజయ్ మాల్యా అప్పుల కింద విజయ్ మాల్యా ఆస్తులను వేలం వేయడానికి బ్యాంకులకు చట్టపరంగా హక్కులు లభించాయి.
ముంబై నగరంలో విమానాశ్రయానికి దగ్గరలో విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్‌ను బ్యాంకులు వేలం వేశాయి. ఈ వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా బ్యాంకులు నిర్ణయించాయి. హైదరాబాద్‌కి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఈ వేలంలో భవంతిని కేవలం బేస్ ధర దగ్గరే కైవసం చేసుకున్నట్టు తెలిసింది.
ఈ భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016 సంవత్సరంలోనే వేలానికి పెట్టింది. ఈ భవంతికి ఇంతకుముందు ప్రారంభ ధరను బ్యాంకులు రూ.150 కోట్లుగా పెట్టడంతో దీన్ని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. తరువాత చాలా సార్లు బ్యాంకుల ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు ఇక చివరకు ఆ భవనానికి ధర తగ్గించి దాని ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో అది బేస్ ధర వద్ద వెంటనే అమ్ముడు పోయింది.