వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీ ప్రతిపాదనపై నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టర్‌పై గ్రామస్తులు దాడి చేసారు.
తెలంగాణ: వికారాబాద్ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు వేదిక వద్దకు వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, అదనపు కలెక్టర్ లింగా నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ లకు గ్రామస్థుల నుండి నిరసన సెగ తగిలింది.
ఫార్మా కంపెనీ ఏర్పాటుతో భూములు కోల్పోతామని భయపడుతున్న రైతులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో, దుగ్యాల మండలంలోని దుగ్యాల, లగచర్ల, పోలేపల్లి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే గ్రామంలోని రైతులు తమ ఊరిలోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు.
లగచర్ల గ్రామానికి చేరుకున్న కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు గ్రామస్థుల నుండి వ్యతిరేకత ఎదురైందే కాకుండా, ఆయనపై దాడికి కూడా యత్నించారు. “కలెక్టర్ డౌన్ డౌన్” అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆయన ప్రయాణిస్తున్న కారుతో పాటు ఇతర అధికారుల వాహనాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు. నిరసనకారుల చర్యలతో గ్రామంలో భీతావహ వాతావరణం నెలకొంది.
ఈ ఘటనలో, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా అధికారులు గ్రామంలోకి వెళ్లడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.