చెన్నై: తమిళనాడు కు చెందిన మాస్ సినీ హీరో విశాల్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. ఇటీవల నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, మరియు తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పోటీ చేసి గెలుపోందిన విషయం తెలిసిందే.
ప్రైవేటు రంగంలో రెండు కీలక పదవులు చేపట్టి సత్తా చాటుకున్న విశాల్ రాజకీయాల్లోకి కూడా తాను త్వరలో అడుగు పెట్టనున్నట్లు తాజాగా ప్రకటించాడు. త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఏదైన ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తాను రాజకీయ ప్రవేశం చేయాలని విశాల్ నిర్ణయించుకున్నాడు.
కాగా తన రాజకీయ ప్రవేశం కోసం అభిమాన సంఘాల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారని సమాచారం. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఈ విషయాన్ని విశాల్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతితో గతంలో ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో విశాల్ పోటీ చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ ఎలక్షన్‌లో నామినేషన్ కూడా వేశాడు. అయితే నామినేషన్‌ను ప్రతిపాదించిన 10 మందిలో కొంత మంది తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో ఎన్నికల కమిషన్ విశాల్ నామినేషన్‌ను తిరస్కరించింది.
అందుకు అప్పుడు జరిగిన ఉపఎన్నికల్లో విశాల్ పోటీ చేయలేకపోయాడు. ఇక త్వరలో రాబోయే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు విశాల్ సిద్ధమవుతున్నాడు. దీంతో టీఎఫ్‌పీసీ అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా విశాల్ రాజీనామ చేయాలని తమిళ పరిశ్రమకు చెందిన దర్శక, నిర్మాతల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
దర్శక నటుడు చరన్ మాట్లాడుతూ, ‘గత ఆదివారం జరిగిన నిర్మాతల కౌన్సిల్ సమావేశంలో విశాల్ తమ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే నడిగర్ సంఘం, నిర్మాతల కౌన్సిల్ కానీ రాజకీయ పార్టీలు కాదని ఆయన తెలిపారు. అంతేగాక టీఎఫ్‌పీసీ ఉప చట్టాల ప్రకారం తమ సభ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించలేరని, ఒకవేళ విశాల్ అలా చేయాలనుకుంటే నిర్మాతల కౌన్సిల్‌కు, అసోసియేషన్‌లకు రాజీనామా చేసిన తర్వాతే అతడు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్మాత, దర్శకుడు రాజేందర్ డిమాండ్ చేసారు.