టాలీవుడ్: కెరీర్ ఆరంభం నుండి వైవిధ్య మైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. తన సినిమాల ద్వారా ఎంతో కొంత ఎన్లైట్ చేస్తూ ఉంటాడు క్రిష్. మధ్యలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా అంతగా ఆడకపోవడం తో కొంత స్లో అయ్యాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీర మల్లు’ అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. మధ్యలో మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ తో ఒక సినిమా రూపొందించాడు కానీ విడుదలకి సరైన టైం కోసం చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ షూట్ పూర్తి చేసే పనిలో ఉండడం తో ఈ గ్యాప్ ని వైష్ణవ తేజ్ సినిమా రిలీజ్ కోసం వాడుతున్నాడు క్రిష్.
వైష్ణవ తేజ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపొందింది. అతి తక్కువ టైం లో దాదాపు 45 రోజుల్లో ఈ సినిమా షూట్ ని పూర్తి చేసారు. ఈ సినిమాకి ‘కొండపొలం’ అనే టైటిల్ తో పాటు ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ ని ఇవాళ విడుదల చేసారు. సన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్టు డైరెక్టర్ క్రిష్ కథా రచయితకి క్రెడిట్స్ కూడా ఇచ్చారు. ఒక ఇంటెన్స్ లుక్ తో వైష్ణవ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా క్రిష్ కెరీర్ ఆరంభం లో వచ్చిన గమ్యం, కృష్ణం వందే జగద్గురుమ్ లాంటి కాన్సెప్ట్ తో రానుందని అర్ధం అవుతుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతంలో ఈ సినిమా రూపొందింది. ఈ రోజు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ సినిమాని అక్టోబర్ 8 న థియేటర్ లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.