కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతా ఇటీవల తన న్యాయ పోరాటాన్ని మరింత వేగవంతం చేశారు. గత ఐదేళ్లుగా కేసు వివిధ కారణాలతో నత్తనడకన సాగుతోంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో సునీత మరోసారి న్యాయం కోసం తమ కృషిని కొనసాగిస్తున్నారు.
ఈ రోజు కడప ఎస్పీ విద్యాసాగర్‌ను కలిసిన సునీతా తన తండ్రి హంతకులను శిక్షించడంలో పోలీసులు చురుగ్గా వ్యవహరించాలని కోరారు.
అలాగే, వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డి తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.
ఇక, గతంలో హోంమంత్రి అనితను కలిసిన సునీతా, అప్పటి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కూడా వివేకా కేసుపై చర్చించారు. పోలీసుల సహకారంతో సీబీఐ దర్యాప్తు ముందుకు సాగాలని కోరారు.
ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభావం ఉండటంతో కేసు పరిష్కారం త్వరగా జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేర్లు ఈ కేసులో వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలనలో అవినాష్ సహా ఇతరులకు కేసు మరింత ఇబ్బందికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.