కదిరి, అనంతపురం: ఆమె నిన్నటి దాకా ఒక గ్రామ వాలంటీర్. ఆమె తన పరిధిలోని ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేశారు. అయితే ఇప్పుడు ఆమె వలంటీర్లు, అధికారుల భాగస్వామ్యంతో ఊరు మొత్తానికి సేవ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడూ ఆమె వారి ఊరందరి సహకారంతో సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అనంతపురం జిల్లాలోని కదిరి మండలం ముత్యాలచెరువు పంచాయతీ సర్పంచ్ స్థానానికి బీసీ మహిళకు రిజర్వ్ చేయడం జరిగింది. నారికే శుభలేఖ తన వలంటీర్ ఉద్యోగాన్ని వదిలి సర్పంచి బరిలో నిలిచింది. ఆమెతో పాటు మరో ముగ్గురు కూడా సర్పంచి పదవికి నామినేషన్‌లు వేశారు.
అయితే శుభలేఖ ఉత్తమ సేవలు అందించి ఉండటం, గ్రామస్తుల నిర్ణయం మేరకు మిగతా ముగ్గురు గురువారం నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో శుభలేక సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా ఆమె కలవగా, పూలమాలతో సత్కరించారు.