హైదరాబాద్ : తెలంగాణలో కొద్ది నెలల క్రితం రెవెన్యూ శాఖలో చేపట్టిన సంస్కరణలో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 5,348 మంది వీఆర్వోలు గత కొన్ని నెలలుగా పనిలేకుండా ఖాళీగా ఉంటున్నారు. అవసరాన్ని బట్టి వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని, అప్పటివరకు వారికి యథావిధిగా జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించారు.
తాజాగా వీఆర్వోలను రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా వీఆర్వోలను ఇప్పుడు వీరిలో 40 శాతం మందిని పురపాలక శాఖలోకి తీసుకోనున్నారు. వార్డుకొకరు చొప్పున, జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని 141 పురపాలికల్లో దాదాపు 2,200 వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తొలుత ఈ వార్డు ఆఫిసర్ల పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే వీఆర్వోలను పురపాలక శాఖలో విలీనం చేసుకుని వార్డు ఆఫీసర్లుగా నియమించాలనే ఆలోచన రావడంతో ప్రత్యక్ష నియామకాల ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనబెట్టింది. వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేసేందుకు అవసరమైన విధివిధానాలను ప్రభుత్వం రూపొందించాల్సి ఉంది.