ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు-2025పై రాజకీయ వివాదాలు ముదురుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీలు ఈ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ముస్లిం సమాజ హక్కులను కాలరాస్తోందని ఆరోపణలతో ఈ బిల్లును వెంటనే నిలిపివేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్‌లు కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీలు కలిసి దాఖలు చేశారు. బిల్లు నిబంధనలు ముస్లిం మత స్వాతంత్య్రాన్ని హరిస్తాయని, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ప్రభుత్వ జోక్యాన్ని పెంచేలా రూపొందించారని వారు పేర్కొన్నారు.
ఇది మతపరమైన స్వయం ప్రతిపత్తికి విఘాతం కలిగిస్తోందని చెప్పారు. వక్ఫ్ బిల్లును పార్లమెంటులో ఎన్డీఏ బలంపై ఆమోదింపజేశారు. లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్షాల వ్యతిరేకత ఉన్నప్పటికీ, వాయిస్ ఓట్లతో బిల్లు ముందుకు సాగింది. ప్రతిపక్షాలు దీనిని మైనారిటీలపై దాడిగా పరిగణిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌లో శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ముస్లిం సమాజం పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసనలు తెలిపింది. వక్ఫ్ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ఇప్పుడు ఈ బిల్లు చట్టబద్ధమవుతున్న తరుణంలో దేశ అత్యున్నత న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. తుది తీర్పు వరకు ఇది మరో మతపరమైన చర్చకు వేదిక కావడం ఖాయం.