fbpx
Saturday, January 18, 2025
HomeBig Storyతెలంగాణ వరంగల్ లో కొత్త కరోనా కేసు నమోదు

తెలంగాణ వరంగల్ లో కొత్త కరోనా కేసు నమోదు

WARANGAL-REGISTERS-NEW-CORONA-STRAIN-FROM-UK-RETURN-PERSON

హైదరాబాద్‌: యూకే సహా పలు దేశాలను వణికిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌ తెలంగాణకూ సోకింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా కన్నా సుమారు 70 శాతం అధికంగా వ్యాప్తి చెందే గుణం ఉన్న కరోనా కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో తొలి కేసు సోమవారం నమోదైంది. యూకే నుంచి ఈ నెల 10న వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తిలో కొత్త రకం కరోనా వైరస్‌ ఉన్నట్లుగా సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ) నిర్ధారించింది.

కాగా ఈ వివరాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలు జరుగుతుండటంతో వాటన్నింటి ఫలితాలను కేంద్ర ఆరోగ్యశాఖ ఏకకాలంలో ప్రకటించే అవకాశాలున్నాయి. నమోదైన కొత్త వైరస్‌ కేసు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ సోమవారం ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. అన్ని జిల్లాల వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి వీలైనంత వేగంగా అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. యూకే నుంచి వచ్చిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన ఆ వ్యక్తిలో ఈ నెల 16న కరోనా లక్షణాలు కనిపించగా జిల్లాలోనే పరీక్షలు నిర్వహించగా 22న పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అతను అప్పట్నుంచీ వరంగల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్నుంచి సేకరించిన శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం సీసీఎంబీకి పంపగా ఆ నమూనాల్లో కరోనా కొత్త రకం వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితంగా మెలిగిన వారికి తక్షణమే పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో బాధితుడి తల్లి (71)కి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను కూడా అదే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాలేదని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కొత్త రకం కరోనా వైరస్ చాలా‌ వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ దానివల్ల మరణాల తీవ్రత మాత్రం తక్కువే ఉంది. వ్యాక్సిన్‌ వచ్చేవరకు అందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. భౌతిక దూరం నిబంధన పాటించాలి. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి అని డాక్టర్‌ కిరణ్‌ మాదల, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి ప్రజలను కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular