లక్నో : కరోనా మహమ్మారి నివారణకుగాను దేశవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వర్కర్‌లకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభమైన తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. టీకా తీసుకున్న మరుసటి రోజే ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగి కన్నుమూసిన విషయం ఆందోళన రేపుతోంది.
గత వారం శనివారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొరాదాబాద్‌కు చెందిన మహిపాల్ సింగ్(46) అనే వార్డ్ బాయ్ శనివారం మధ్యాహ్నం కోవిడ్ వ్యాక్సిన్ షాట్ తీసుకున్నారు. తీసుకున్న 24 గంటల తరువాత అతనికి ఛాతీలో ఇబ్బంది, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలతో ఆదివారం సాయంత్రం ఆయన మరణించారు.
కాగా ఆయన వ్యాక్సిన్ తీసుకోడానికిముందే అనారోగ్యంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. న్యూమోనియా, సాధారణ జలుబు,దగ్గు లాంటి స్వల్ప లక్షణాలతో తన తండ్రి బాధపడుతున్నారని మహీపాల్ సింగ్ కుమారుడు విశాల్ మీడియాతో అన్నారు. శనివారం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో తానే ఆయనను ఇంటికి తీసుకు వచ్చానని, కానీ ఆ తరువాత మరింత అనారోగ్యానికి గురయ్యాడని, ఛాతిలో నొప్పి, ఊపిరి ఆడక ఆయన చనిపోయారని తెలిపారు.
ఇదిలా ఉండగా మహిపాల్ మరణానికి, వ్యాక్సిన్ కు ఎలాంటి సంబంధం లేదని భావిస్తున్నామని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎంసీ గార్గ్ వెల్లడించారు. మరణానికి కారణాలను పరిశీలిస్తున్నామన్నారు. “కార్డియో-పల్మనరీ డిసీజ్” కారణంగా “కార్డియోజెనిక్ షాక్ లేదా సెప్టిసెమిక్ షాక్” తో చనిపోయినట్టుగా పోస్ట్మార్టం నివేదిక ద్వారా తెలుస్తోందని యూపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా కోవిడ్ టీకా డ్రైవ్ మొదటి రోజు శనివారం 22,643 మందికి టీకాలు వేసినట్లు యోగి సర్కార్ తెలిపింది. రాష్ట్రంలో రెండవ విడత టీకా కార్యక్రమం జనవరి 22, శుక్రవారం ఉంటుందని వెల్లడించింది.