సిడ్నీ: భారతదేశంలోని సినిమా పాటలకు విదేశాలలో అభిమానులు చాలానే ఉన్నారు. అందులో మొదటి వరుసలో ఉండేది డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ అయిన వార్నర్ మళ్లీ తన పర్ఫార్మెన్స్ మొదలుపెట్టాడు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ యొక్క మొదటివేవ్ లాక్‌డౌన్ సమయంలో వార్నర్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆడి పాడిన విషయాన్ని ఎవరు మరిచిపోలేరు.
సోషల్ మీడియా యాప్స్ ఐన టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ఇలా అన్నింటినీ వదలకుండా వాడి తన డ్యాన్స్‌లు, డైలాగ్స్, మేనరిజమ్స్‌తో ఫ్యాన్స్‌ను బాగా అలరించాడు. అందునా ఇండియన్ సినిమాలంటే వార్నర్‌కు చాలానే ఇష్టం. తన ఆ ప్రదర్శనలతో కొత్త ఫ్యాన్సును కూడా సంపాదించుకున్నాడు.
భారత్ లోని సినిమాలలో తనకు ముఖ్యంగా సౌత్ సినిమాలపై ప్రేమ ఎక్కువ, టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమాల నుంచి పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం, డైలాగ్స్‌తో అనుకరించాడు.
ఇటీవలే ఐపీఎల్ 14వ సీజన్ రద్దుతో స్వదేశానికి చేరుకున్న వార్నర్ తనకు విరామం దొరకగానే తిరిగి భారత్ సినిమా పాటకు స్టెప్పులు వేశాడు. కాగా ఈసారి తమిళ స్టార్ ధనుష్ మారి-2 సినిమాలోని రౌడీ బేబీ పాటను అనుకరించాడు. ధనుష్ స్థానంలో తన ఫేస్‌ను మార్ఫింగ్ చేసి దానికి సంబంధించిన వీడియో వార్నర్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.