న్యూఢిల్లీ: దేశంలో సోషల్ మీడియ అయిన ట్విట్టర్‌తో నెలకొన్న ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాతో పాటు యూజర్లకు కేంద్ర ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక మీదట సోషల్ మీడియాలో అసత్య వార్తలు వ్యాపింపజేసిన, హింసను ప్రేరేపించినా కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ప్రకటించారు.
రాజ్యసభలో కేంద్ర మంత్రి ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్, లింక్డ్‌ఇన్‌ల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “మీకు భారతదేశంలో మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. మీరు వ్యాపారం చేసుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి స్వేచ్ఛ ఉంది. కానీ మీరు తప్పనిసరిగా భారత రాజ్యాంగాన్ని అనుసరించాల్సి ఉంటుంది” అని అన్నారు.
క్వశ్చన్ అవర్ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగంపై ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు. “మేము సోషల్ మీడియాను చాలా గౌరవిస్తాము, ఇది సామాన్య ప్రజలను శక్తివంతం చేస్తుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సోషల్ మీడియాకు పెద్ద పాత్ర ఉంది. అయితే, నకిలీ వార్తలు, హింసను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవు” అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
ఖలిస్తాన్, పాకిస్తాన్ లింకులున్న మొత్తం 1,178 ఖాతాలను బ్యాన్ చేయాలన్న హెచ్చరికల నేపథ్యంలో పలు ఖాతాలను ఇప్పటికే తొలగించిన ట్విట్టర్, కొద్దీ రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలు చట్ట విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమంటూ ఒక బ్లాగ్ పోస్ట్ లో వివరణ ఇచ్చింది. అయితే దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.