హైదరాబాద్ లో విజయ డెయిరీ పాలను వాడేవారికి హెచ్చరిక!
విజయ డెయిరీ పేరుతో నకిలీ పాల విక్రయం
తెలంగాణలో విజయ డెయిరీ పేరుతో నకిలీ పాలను విక్రయిస్తున్న ముఠాలపై డెయిరీ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఆయన, విజయ బ్రాండ్ స్టిక్కర్లను అనుమతించని ప్రైవేట్ డెయిరీలు, డిస్ట్రిబ్యూటర్లు, విక్రేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కల్తీ మాఫియా రెచ్చిపోతోంది
ఇటీవల కల్తీ మాఫియా ప్రభావం అధికమైంది. కారం, పసుపు, నూనె వంటి నిత్యావసరాలు మాత్రమే కాకుండా, చిన్నపిల్లల ఆరోగ్యానికి కీలకమైన పాలు కూడా కల్తీ అవుతున్నాయి. నకిలీ పాలను విజయ డెయిరీ పేరుతో విక్రయించి, ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు.
విజయ డెయిరీ లోగో చూసి పాలు కొనండి
విజయ డెయిరీ బ్రాండింగ్, లాఫింగ్ కౌ లోగోను వాడే హక్కు కేవలం అధికారిక యూనియన్లకే ఉందని స్పష్టంగా తెలిపారు. ప్రజలు ప్యాకెట్‌పై లోగోను పరిశీలించి మాత్రమే విజయ డెయిరీ పాలను కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ పాల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నకిలీ పాలను గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయండి
విజయ డెయిరీ పేరుతో నకిలీ పాలను విక్రయించే వ్యక్తులు అత్యంత దురాశతో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని, అలాంటి ఘటనలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదనపు చర్యల కోసం కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు.