అమరావతి: ఇసుక, మద్యం జోక్యంపై తమ్ముళ్లకు చంద్రబాబు వార్నింగ్
కొందరు ఎమ్మెల్యేల వ్యవహారిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వీరి వ్యవహారశైలి పార్టీకి చెడ్డపేరు తెస్తోందని భావిస్తున్నారు. ఉచిత ఇసుక సరఫరా, మద్యం టెండర్లలో కొందరు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటూ కేడర్‌కు నష్టాన్ని కలిగిస్తున్నారని ఆయన ఆందోళన చెందుతున్నారు.
సీనియర్ల సూచనలపై చర్యలు
2014-19 మధ్య జరిగిన పొరపాట్లు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని చంద్రబాబును పలువురు సీనియర్లు హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ నెల 18వ తేదీన టీడీపీ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఎమ్మెల్యేల ప్రవర్తన, పార్టీ సభ్యత్వ నమోదు, కేడర్ పరిపాలన, మిత్రపక్షాలతో సమన్వయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
విడివిడిగా సమావేశాలు
అంతేకాక, పార్టీ పక్ష సమావేశం ముగిసిన తరువాత, 19వ తేదీన కొందరు ఎంపిక చేసిన ఎమ్మెల్యేలను చంద్రబాబు విడివిడిగా పిలిచి సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఆ జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు వ్యవహారశైలిని మార్చుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించనున్నారు. ఈ సమావేశాల నేపథ్యంలో జాబితాలో తమ పేర్లు ఉంటాయేమోనని కొంత మంది నేతల్లో ఉత్కంఠ నెలకొంది.