హైదరాబాద్: ‘వ్యర్థం నుంచి అర్థం’, ఇప్పటికే చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ చెత్తను నిర్వహించడంలో మరో కీలక ముందడుగు వేసింది. సిటీలో ఉన్న జవహర్‌నగర్ డంపింగ్ యార్డులోని చెత్త ద్వారా వాహన ఇంధనంగా ఉపయోగపడే కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తిని ప్రారంభించింది.
ఈ విధానంతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో చెత్తగుట్ట సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు పర్యావరణపరంగా, ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరనుంది. హానికరమైన విష వాయువుల నుంచి వెలువడే వాయు కాలుష్యం కూడా దీని వల్ల తగ్గుతుంది. గ్యాస్ ఉత్పత్తితో ఆ మేరకు డీజిల్ వినియోగం కూడా తగ్గనుంది.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో దాదాపు 130 ఎకరాల మేర ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త గుట్ట నుంచి వెలువడే దుర్గంధం, పరిసర ప్రాంతాల ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకు దాన్ని క్యాపింగ్ చేసి సైంటిఫిక్ ల్యాండ్‌ఫిల్‌గా మార్చడం జరిగింది.
కాగా ఈ సైంటిఫిక్ ల్యాండ్‌ఫిల్ నుంచి దాదాపు 8 సంవత్సరాల వరకు గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొన్నేళ్ల వరకు తక్కువ పరిమాణంతో గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు. దీంతోపాటు చెత్తగుట్టలోని కాలుష్య ద్రవాలు తొలగించే పనులు కూడా చేపట్టినందున చెత్తగుట్ట స్థిరీకరణ జరుగుతుంది.
చెత్తగుట్ట నుంచి ఉత్పత్తవుతున్న ఈ గ్యాస్‌ను చెత్త తరలింపు వాహనాలకు వినియోగించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. నగరంలోని వివిధ చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నుంచి చెత్తను ట్రక్కుల ద్వారా డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. సదరు ట్రక్కుల డీజిల్ ఇంజిన్లను తొలగించి వాటిస్థానంలో సీఎన్‌జీ ఇంజిన్లను అమర్చి గ్యాస్‌ను వినియోగించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.