హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో శ్రావణ మాసం అంటేనే పెళ్ళిళ్ళ పండంగ లాంటిది. అలాగే ఈ మాసంలో ఎన్నో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు. ఈ మాసం లో చిన్నా చితక పండుగలు చాలానే వస్తాయి. దాదాపు ప్రతి ఇల్లు సందడిగానే ఉంటుంది.
అందులోనూ ఈ నెలలో వచ్చే వివాహ ముహూర్తాల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ ఇదంతా కరోనా కి ముందు పరిస్థితి. ఇప్పుడు అవన్నీ కుదరవు అంటోంది కరోనా. ఎక్కడ గుంపుగా జనం ఉంటే అక్కడకు నేను వస్తా అంటొంది కరోనా. కరోనా దెబ్బకు ఈసారి పెళ్లిళ్లలో బ్యాండ్ బాజాలు మోగే పరిస్థితి లేదు. పందిళ్లు.. సందళ్లు అసలే లేవు.
పెళ్లిళ్ల నిర్వహణలో అట్టహాసాలు, ఆడంబరాలు ఇక ‘గతం’ కానున్నాయి. ఆగష్టు 15వ తేదీ వరకు ఉన్న ముహూర్తాలలో ఏదో ఒకటి నిశ్చయం చేసుకుని, గతంలో వాయిదాపడిన వివాహాలతో పాటు కొత్తవీ మమ అనిపించే యోచనలో ప్రజలు ఉన్నారు. బంధుమిత్రుల సమక్షంలో సందడిగా జరుపుకునే పెళ్లిళ్లను భయం భయంగా కొద్దిమందితోనే కానిచ్చేస్తున్నారు.
కరోనా వల్ల ఇప్పుడు పెళ్ళిళ్ళకు వెళ్ళాలన్నా భయపడుతున్నారు. పిలుపులు కూడా చాలా వరకు తగ్గి పోయాయి. ఒకప్పుడు పెళ్ళిళ్ళకు ఎంత ఎక్కువ మంది వస్తే అంత సంతోషం, ఇప్పుడు ఎంత తక్కువ మంది వస్తే అంత క్షేమం. ఇక పెళ్ళిళ్ళు చేయాలన్నా చేసుకోవాలన్నా తహసీల్దార్ అనుమతి కచ్చితంగా తీసుకోవాలి.
పెళ్ళి చేసుకోవాలంటే కరోనా టెస్టు చేసుకుని నెగటివ్ వచ్చుండాలి. కొన్ని ప్రాంతాలల్లో ఏకంగా పెళ్లికి వచ్చేవారు కూడా కరోనా టెస్టు చేయించుకుని ఆ రిపోర్టును తహసీల్దార్‌కు ఇవాల్సిన పరిస్థితి ఉంది. తహసీల్దార్ ఓకే అంటేనే పెళ్లికి వెళ్లేది.
ఇలా వచ్చే వారంతా కరోనా టెస్టు చేయించుకోవాలంటే ఎలా అని అటు ఆహ్వానించే వారు, ఇటు ఆహ్వానితులు తలలు పట్టుకుంటున్నారు. పెళ్లికి వచ్చేవారు ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్న నిబంధన కూడా కొన్నిచోట్ల ఇబ్బంది పెడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పెళ్లికి వచ్చిన బంధువులు, అలా ముఖం చూపించి ఇలా వెళ్లిపోతున్నారు.
కరోనా కి ముందు పెళ్లిళ్లూ, విందుల్లో ఆర్కెస్ట్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. జిగేల్‌మనే దీపాలు, డీజే, బ్యాండుమేళాలతో పెళ్లి ప్రాంగణం మారుమోగేది. కరోనా ఆంక్షలతో వీటికి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో ఆర్కెస్ట్రాలకూ, బ్యాండ్‌బాజాలకు పనిలేకుండా పోయింది. అందులో పనిచేసే వారు ఇతర పనులు వెతుక్కుంటున్నారు.
ఇంతకు ముందు పెళ్ళి వేడుకల గురించి ఐతే చెప్పాల్సిన అవస్రం లేదు. ఎంత పెద్ద ఫంక్షన్ హాలులో పెళ్లిచేస్తే అంత గొప్ప అన్నట్టుండేది. దాదాపుగా పెళ్ళి పందిర్లు సినిమా సెట్టింగుల రేంజు లో ఉండేవి. ఇప్పుడంతా మినీ హాళ్లకే పరిమితవుతున్నారు. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్‌లో హాళ్లు దొరకాలంటే తల ప్రాణం తోకకొచ్చేది.
ఇప్పుడు ఏ ఇంట పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారో తెలుసుకుని మరీ ఫంక్షన్ హాళ్ల యజమానులే ఎదురు ఫోన్ చేస్తున్నారు. తక్కువ మొత్తానికి ఫంక్షన్ హాళ్లను ఇస్తామంటున్నారు. ఏదైనా వివాహ కార్యక్రమం జరుగుతుందంటే ఫంక్షన్ హాలులో పనిచేసే వారు 20 నుంచి 50 మంది వరకు ఉండేవారు. ఇప్పుడు ఇటువంటి వారి ఉపాధికి గండిపడింది.
WEDDING DURING LOCKDOWN INDIA | WEDDING DURING LOCKDOWN INDIA