తెలంగాణ: 10 ఏళ్ళలో చేయలేనిది 10 నెలల్లో సాధించాం: రేవంత్ రెడ్డి
తమ ప్రభుత్వమే అభివృద్ధి, పారదర్శకతకు నిలువెత్తు నిదర్శనమని, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేనిదాన్ని కేవలం పది నెలల్లోనే చేసి చూపించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన సీఎం, రాజన్న ఆలయ విస్తరణ పనులకు రూ.76 కోట్లతో భూమి పూజ నిర్వహించి ప్రసంగించారు.
పరిశ్రమలు అభివృద్ధికి భూముల సేకరణ తప్పనిసరని, బాధిత రైతులకు మూడింతల నష్టపరిహారం అందజేయాలని తన ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
“వికాసమే లక్ష్యం – ప్రతిపక్షాలు అడ్డంకులు,” అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
పరిశ్రమలు తీసుకురావడంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆటంకాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“భూముల సేకరణకు ప్రతిపక్షాలు అడ్డుకట్ట వేస్తూ అభివృద్ధి నిరోధించడానికి ప్రయత్నిస్తున్నాయి,” అని వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా అధికారులపై దాడులు, రౌడీ మూకల సృష్టి వంటి కుట్రలకు కెటిఆర్ కారణమని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ కుట్రలు:
రంగనాయక సాగర్ ప్రాజెక్టు, కొండపోచమ్మ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సర్కార్ అక్రమ పనులు జరిపిందని, వాటి కోసం భూసేకరణతో పాటు భూసేకరణ చట్టాలను వక్రీకరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.
“ప్రాజెక్టులను తాత్కాలిక ప్రయోజనాల కోసం నిర్మించినారు, ప్రజల సొమ్ము వృధా చేశారు. కేసీఆర్ పాలన మొత్తం ఫాంహౌస్ కు నీటిని తీసుకెళ్ళే అంశంపై దృష్టిపెట్టడమే సరిపోయింది అని రేవంత్ విమర్శించారు.
పేదలకు ఒక చట్టం – వారికో మరో చట్టం!
అక్రమ భూసేకరణ, అక్రమ నిర్మాణాలపై కేసులు పెడితే, బీఆర్ఎస్ నేతలు తమపై ఇష్టారాజ్యంగా చేయకూడదనే సూత్రం పాటించాలని చెబుతున్నారు.
“డ్రగ్స్, అక్రమ మద్యం, ఫాంహౌస్ లు వంటి ప్రవర్తనలపై చర్యలు తీసుకోవద్దని చెబుతున్నారు” అంటూ సీఎం తీవ్రంగా విరుచుకుపడ్డారు.
మా పాలనలో ఉద్యోగాల గణాంకాలు
ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన తన ప్రభుత్వం కేవలం పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు సృష్టించిందని, గత పదేళ్లలో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలకు లెక్క గడితే తాము ముందున్నామన్నారు.
“రైతులకు రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలతో అందరికీ అండగా నిలిచాం,” అని సీఎం వివరించారు.
మోదీతో బండి సంజయ్ ఏం సాధించారు?
కరీంనగర్ నుంచి ఎంపీగా రెండుసార్లు గెలిచిన బండి సంజయ్, ప్రధాని మోదీ నుంచి ఒక్క రూపాయి నిధులైనా తెచ్చారా? అని ప్రశ్నించారు.
అలానే, తెలంగాణ అభివృద్ధి కోసం తాము తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించకుండా, ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం సరికాదన్నారు.
“తాము చేస్తున్న అభివృద్ధి పనులు దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తా” అని రేవంత్ రెడ్డి అన్నారు.
సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యం
చేనేత కార్మికులు, మహిళా సంఘాలకు సహకారం అందించడం, గల్ఫ్ కార్మికులకు సంక్షేమం అందించడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.