అమరావతి: “వైఎస్సార్ కుటుంబ వివాదానికి చంద్రబాబుకు సంబంధం ఏంటి?” – బాలినేని శ్రీనివాసరెడ్డి
వైఎస్సార్ కుటుంబంలో సాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించిన మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈ విషయానికి చంద్రబాబుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్ కుటుంబానికి చెందిన జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య జరుగుతున్న ఈ వివాదం గురించి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బాలినేని వ్యాఖ్యలు
బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, “ఆడపడచు కన్నీళ్లు ఇంటికి అరిష్టం” అని గుర్తుచేశారు. జగన్ ఈ విషయాన్ని మానసికంగా అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. “విజయమ్మకు ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. అందులో విజయమ్మ తప్ప ఎవరూ జోక్యం చేసుకోకూడదు,” అని ఆయన అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా వైఎస్సార్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆస్తులు సంపాదించుకుని పార్టీ మారినట్లు కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎఎస్సార్సీపీలో తాను ఏమీ సంపాదించుకోలేదని ఉన్నవి కూడా పోగొట్టుకున్నట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.
“నా బిడ్డ సాక్షిగా చెబుతున్నా నేనేమీ సంపాదించుకోలేదు. నాపై విమర్శలు చేసేవాళ్లు జగన్‌ను నేరుగా అడగండి. ఎలా పోగొట్టుకున్నానో ఇన్నాళ్లూ నేను మనసులోనే పెట్టుకున్నా. నాకు సంస్కారం ఉంది కాబట్టే నేనేమీ మాట్లాడలేదు. పార్టీ మారాక ఆ పార్టీ గురించి నాయకుడి గురించి మాట్లాడలేదు. నా తండ్రి ఆస్తులమ్మి అప్పులు తీర్చుకున్నా జగన్‌కు తెలియదా? నా కోడలికి వచ్చిన ఆస్తులు అమ్మి కూడా అప్పులు తీర్చుకున్నా. ఆస్తులు పోయినా నేను మనసులో పెట్టుకున్నా. ఆస్తుల కోసం ఇప్పుడెందుకు జగన్ రోడ్డుపైకి వస్తున్నారు. ఆడబిడ్డ కన్నీళ్లు కుటుంబానికి మంచిది కాదని చెబుతున్నా.” – బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేన నేత
పవన్ కల్యాణ్ గురించి
ఎన్నికలకు ముందే తనను పార్టీలోకి తీసుకోవాలని అనుకున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీలోకి తీసుకుందామంటే జగన్‌కు బంధువు అయినందున అడగలేదన్నారు. బంధువులను చీల్చడం తనకు ఇష్టం లేదని పవన్ హుందాగా మాట్లాడారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఉన్నప్పుడు కూడా వైఎస్సార్సీపీలో బాలినేని వంటి మంచివాళ్లు కూడా ఉన్నారని పవన్ చెబుతుండేవారని బాలినేని వివరించారు.