అమెరికా:అదానీ: అగ్రరాజ్యం అమెరికాలో గౌతమ్ అదానీపై నమోదైన కేసు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అదానీ గ్రూప్ మీద భారత్‌లో రూ.2029 కోట్ల లంచాలు ఇచ్చి, తప్పుడు సమాచారంతో అమెరికాలో నిధులు సేకరించారని వచ్చిన ఆరోపణలపై అగ్రరాజ్యం కీలకంగా స్పందించింది.
ఈ వివాదంలో గౌతమ్ అదానీతో పాటు మరో ఎనిమిది మంది వ్యాపార ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. ఈ అంశంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూడా స్పందించింది.
మీడియా సమావేశంలో వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ మాట్లాడుతూ, అదానీ వివాదం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) మరియు న్యాయశాఖ పూర్తి సమాచారాన్ని అందిస్తాయన్నారు.
అయితే, ఈ వివాదం భారత్ – అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. భారత్ – అమెరికా బంధం బలమైన పునాదిపై నిలిచిందని, ఇరు దేశాలు అనేక అంశాల్లో పరస్పర సహకారాన్ని కొనసాగిస్తున్నాయని తెలిపారు.
సోలార్ పవర్ ప్రాజెక్టుల కోసం ఏపీ, ఒడిశా ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై అన్వేషణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు కలిసి అధిగమిస్తాయని వైట్ హౌస్ ధీమా వ్యక్తం చేసింది.