జెనివా: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ఇప్పుడు యావత్ ప్రపంచానికి పెను ముప్పు వాటిల్లబోతుందని, ఈ పరిణామలు కూడా చాలా తీవ్రంగా ఉండబోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అందరినీ హెచ్చరించింది.
అయితే ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ఎంత తీవ్రంగా, ప్రమాదకరంగా ఉంటుందో అనేది మాత్రం అంత త్వరగా చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ ఇవాళ అన్ని ప్రపంచ దేశాలకు కొన్ని కీలక సూచనలను చేసింది.
డబ్ల్యూహెచ్వో చేసిన సూచనలు:
ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచమంతటా వ్యాపించగలదు. కాబట్టి అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కోరింది.
బి.1.1.529 వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ప్రపంచం మొత్తానికి పెను ముప్పు పొంచి ఉంది. అయితే ఈ వేరియంట్ గురించి అర్థం చేసుకోవడానికి ఇంకా మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ఒమిక్రాన్ అసాంఖ్యమైన స్పైక్ మ్యూటేషన్‌లు కలిగి ఉంది.
రాబోయే రోజుల్లో ఒమిక్రాన్‌కు సంబంధించి ముఖ్యమైన సమాచారం రానుందని తెలిపింది. దీన్ని పరిశోధించిన తర్వాత దీని గురించి మరింత సమాచారం అందుబాటులోకి వస్తుందని సూచించింది.
కాగా ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా ఈ కరోనా వేరియంట్ ఒమిక్రాన్ బారినపడుతున్నారని, అందుకు ప్రపంచ దేశాలు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది.