తెలంగాణ: అపార్ట్‌మెంట్లపై విద్యుత్ భారం ఉపేక్షించం: కేటీఆర్
హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం పెరిగిందంటూ అపార్ట్‌మెంట్ల వాసులపై ట్రాన్స్‌ఫార్మర్ల భారం మోపితే ఊరుకోబోమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు.
ప్రభుత్వం విద్యుత్ లోడ్ పెరుగుదలపై ప్రజలకే వ్యక్తిగత ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని చెబుతుండటాన్ని ఆయన తప్పుబట్టారు.
హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లలో విద్యుత్ వినియోగం 20 కిలోవాట్లు దాటితే ఆ అపార్ట్‌మెంట్ వాసులే సొంతంగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలని దక్షిణ మండల డిస్కం నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు.
“ఈ నిర్ణయంతో ఒక్క హైదరాబాద్ నగరవాసులపై రూ.300 కోట్ల అదనపు భారం పడుతుందని, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఖర్చు రూ.3 లక్షలు వస్తుంది, మధ్యతరగతి ప్రజలకు ఇది భరించడం కష్టమని” కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ లోడ్ పెరిగిందంటే అందుకు తగిన విధంగా ప్రభుత్వం ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
“కొడంగల్ పాకిస్థాన్ సరిహద్దులో ఉందా?”
కొడంగల్‌లో గిరిజన మహిళలపై జరుగుతున్న దమనకాండపై కూడా కేటీఆర్ స్పందించారు.
నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోంది? వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోంది? సీఎం సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి? కొడంగల్ ఏమైనా పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉందా లేక లగచర్ల చైనా సరిహద్దుల్లోని కల్లోలిత ప్రాంతమా? మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.