జాతీయం: పాపులారిటీ కోసం చెత్త మాట్లాడతారా? యూట్యూబర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం
ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘పాపులారిటీ ఉందని ఏదైనా మాట్లాడతారా? ఇలాంటి అసభ్య భాషను సమాజం ఎలా ఆమోదిస్తుంది?’’ అంటూ కోర్టు ప్రశ్నించింది.
🔹 వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం
‘ఇండియాస్ గాట్ లాటెంట్’ (IGL) కార్యక్రమంలో రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలకు గురయ్యాయి. ఒక వ్యక్తిని అతని తల్లిదండ్రుల గురించి, శృంగారం అంశంపై ప్రవర్తనను ప్రశ్నించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై పలువురు పార్లమెంటు సభ్యులు కూడా అభ్యంతరం తెలిపారు.
సమాజానికి అశ్లీలత పెంచే విధంగా ఉన్న వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవని కోర్టు స్పష్టం చేసింది. ‘‘ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి? మీ మెదడులోని చెత్తనంతా బయటపెట్టారు. ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా?’’ అని మండిపడింది.
🔹 కోర్టు ఆదేశాలు – పాస్‌పోర్టు జప్తు, కొత్త కేసులకు నోచాన్స్
రన్వీర్‌పై వివిధ రాష్ట్రాల్లో పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి అన్ని కేసులను కలిపి విచారణ చేపట్టాలని పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కోర్టు కొన్ని కఠిన ఆదేశాలను జారీ చేసింది.
- తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు రణ్‌వీర్ దేశం విడిచిపెట్టకూడదు
- తన పాస్‌పోర్టును మహారాష్ట్ర ఠాణె పోలీసులకు అప్పగించాలి
- తర్వాతి ఉత్తర్వుల వరకు ఎలాంటి షోలు చేయకూడదు
- రణ్‌వీర్‌పై కొత్త కేసులు నమోదు చేయకూడదు
🔹 సుప్రీంకోర్టులో చర్చ – నైతికత, ఆన్‌లైన్ కంటెంట్‌పై ప్రశ్నలు
ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారించింది. మొదట, నైతికతకు విరుద్ధంగా ఉన్న వ్యాఖ్యలను సమాజం ఎలా సమర్థించగలదని ప్రశ్నించింది. రెండవది, సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
రణ్‌వీర్ తరఫున, ఇటీవలే సుప్రీంకోర్టు సీజేఐ బాధ్యతల నుంచి రిటైరైన జస్టిస్ డీవై చంద్రచూడ్ కుమారుడు అభినవ్ చంద్రచూడ్ వాదనలు వినిపించారు. ‘‘రణ్‌వీర్ వ్యాఖ్యలను నైతికంగా సమర్థించలేమని, అయితే అతడిని హత్య చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి’’ అని కోర్టుకు వివరించారు.
సమాజంలో తగిన నియంత్రణ లేకుండా ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చూడాలన్న ఉద్దేశంతో కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్రం తక్షణమే వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.