క్రిస్ట్‌చర్చ్: పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో డబుల్ సెంచరీ సాధించాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన విలియమ్సన్, తాజాగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కూడా డబుల్ సెంచరీతో మెరిశాడు. పాక్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 364 బంతుల్లో 28 ఫోర్లతో 238 పరుగులు సాధించాడు.
విలియమ్సన్ కు టెస్టు మ్యాచ్ ల కెరీర్‌లో ఇది నాల్గో డబుల్ సెంచరీ. 112 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన విలియమ్సన్ టాప్ గేర్ లో చెలరేగాడు. పాక్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అతనికి జతగా హెన్నీ నికోలస్(157) భారీ సెంచరీ సాధించాడు. దాంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 659/6 వద్ద డిక్లేర్డ్ చేసింది.
కేన్ విలియమ్సన్ ఈ డబుల్ సెంచరీ తో తన టెస్టు కెరీర్‌లో ఏడువేల పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. అదే సమయంలో ఈ ఘనతను వేగంగా సాధించిన కివీస్ బ్యాట్స్‌మన్‌గా కేన్ రికార్డు సాధించాడు. ఈ క్రమంలోనే రాస్ టేలర్ రికార్డును విలియమ్సన్ అధిగమించాడు. టేలర్ 96 మ్యాచ్‌ల్లో ఏడువేల పరుగుల ఘనతను సాధించగా, విలియమ్సన్ 83 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ నమోదు చేశాడు.
అయితే కివీస్ తరుఫున ఏడువేల పరుగులు సాధించిన మూడో టెస్టు బ్యాట్స్‌మన్‌గా విలియమ్సన్ నిలిచాడు. టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్‌ల తర్వాత ఏడువేల పరుగులు సాధించిన మూడో కివీస్ ఆటగాడు విలియమ్సన్ కావడం విశేషం. మరొకవైపు కివీస్ తరఫున వరుసగా మూడు సెంచరీలు సాధించిన నాల్గోబ్యాట్స్‌మన్‌గా విలియమ్సన్ గుర్తింపు పొందాడు.